Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో వింత వాతావరణం: ఒకచోట వానలు, మరోచోట వడగాలులు

AP Weather Heatwaves and Rainfall Alert in Andhra Pradesh
Advertisement
  • ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మూడ్రోజులు వర్ష సూచన
  • రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
  • ఎండల తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కొన్ని జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీస్తుండగా, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటమే ఇందుకు కారణమని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

ఈ ఆవర్తన ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. పిడుగుల ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు, రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. శనివారం నాడు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఓఆర్ఎస్, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి ఎక్కువగా తాగాలని విజ్ఞప్తి చేశారు.
 
Advertisement
Advertisement
AP Weather
Andhra Pradesh Weather
Heatwave
Rainfall
Lightning strikes
Summer
Disaster Management
Heatwave alert
Prachar Jain

More Telugu News